Uncategorized

పారదర్శకంగా ఉండేందుకే వాలంటీర్ వ్యవస్థ

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం, ఏప్రిల్, 12: పాలనా వ్యవస్థ పారదర్శకంగా ఉండేందుకే వాలంటీర్ వ్యవస్థ ను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం భీమిలి శాసన సభ నియోజకవర్గం ఆనందపురం లో ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల సేవా పురస్కార్ ఉత్సవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వాలంటీర్ల నిస్వార్థంగా తమ సేవలు అందిస్తున్నారన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సమస్యలు అక్కడే పరిస్కారమయ్యే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందింతే దేశానికి పట్టుగొమ్మలని పేర్కొన్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ పాలనా వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ పై ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. కోవిడ్ సమయంలో ఇంటింటి సర్వే కి ఎంతో ఉపయోగపడినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 24 వేల 288 మంది పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. వారు చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తించి వాలంటీర్లకు ఒక సముచిత స్థానం కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలోని వాలంటీర్ల వద్దకు వెళ్లి వారిని అభినందించడం జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను అందించాలన్నారు. వాలంటీర్ల అందరినీ ఆయన అభినందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ – 2 పి.అరుణ్ బాబు మాట్లాడుతూ వాలంటీర్ల సేవలు అధ్భుతమని, కోవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు అభినందనీయమన్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ వాలంటీర్లను సేవా పురస్కార్లతో సత్కరించారు. అంతకు ముందు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సమావేశంలో ఆర్డీవో పెంచల కిషోర్, జడ్పీ సీఈవో నాగార్జున సాగర్, డిపిఓ కృష్ణ కుమారి, సర్పంచ్ లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.