Uncategorized

వైసీపీ ది గూండా రాజ్యం

 పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని అరాచకాలు

 2024లో జనసేనదే అధికారం

భారత్ వాయిస్, విశాఖపట్నం:

       ” రాష్ట్రంలో వైసీపీ తప్ప ఏ ఇతర పార్టీలు మనుగడ సాగించకూడదనే ఉద్దేశంతోనే ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. రౌడీలు, గూండాలను ఎమ్మెల్యేలుగానూ, నాయకులుగానూ మార్చి రాష్ట్రాన్ని గూండా రాజ్యంగా మారుస్తారా. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లను అడ్డు పెట్టుకొని ప్రతి పక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తారా. ఇదేం పాలనా. ప్రపంచ దేశాలన్నీ మన దేశ 70 సంవత్సరాల ప్రజాస్వామ్య విధానాన్ని అభినందిస్తుంటే, అలాంటి వ్యవస్థను ఖూనీ చేస్తారా…. అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రగా విరుచుకుపడ్డారు. కొన్ని రోజుల క్రితం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో చోటుచేసుకున్న సంఘటనలపై తన అసంతృప్తిని శనివారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెళ్లగక్కారు. వైకాపా నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ బ్యూరోక్రసీ తన ప్రాభవాన్ని కోల్పోతోందని ఎద్దేవా చేశారు. ఏయే నేరాలకు ఏయే ఐపీసీ సెక్షన్లను విధించాలో తెలియని స్థితిలో విశాఖ పోలీసులు ఉన్నారని అన్నారు. చిన్న చిన్న సంఘటనలకు కూడా హత్యానేరాలను ఆపాదిస్తున్నారని అపహాస్యం చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం చెప్పేందుకు తానూ, ఇతర నాయకులు ఎయిర్పోర్టు విఐపి లాంజ్ లో ఉంటే, అప్పుడే ఎయిర్పోర్టులోకి ప్రవేశించిన మంత్రి రోజాపై హత్యాయత్నం చేశామంటూ ఆరోపణలను ఆపాదిస్తూ అక్రమ కేసులు బనాయించి తమను అరెస్టులు చేస్తారా… ఇదెక్కడి న్యాయం అంటూ విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు అంటే ప్రజల గొంతు అని అర్ధం. అలాంటి గొంతులను నొక్కేస్తారా… ఏమిటీ పైశాచికానందం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది, సమస్యల పరిష్కారం తదితర వాటిపై దృష్టి పెట్టాల్సిన అధికార పార్టీ వైషమ్యాలకు పాల్పడుతోందని కారాలు మిరియాలు నూరారు. తమ పార్టీని అణగదొక్కేందుకు ఎలాంటి విద్రోహక చర్యలకు పాల్పడినా, 2024 ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం

ఖాయమని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ, బొడ్డేపల్లి రఘు, సంకు వెంకటేశ్వరరావు, పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ప్రసాద్ ఇతరులు పాల్గొన్నారు.