Uncategorized

సినిమా రేట్లకు కళ్లెం

సినిమా విడుదల ప్రారంభ రోజుల్లో టికెట్ల రేట్ల పెంపు లేనట్లే

హర్షం ప్రకటిస్తున్న సినిమా ప్రేక్షకులు

సినీ వర్గాల గొంతులో పచ్చి వెలక్కాయ

(భారత్ వాయిస్, విశాఖపట్నం): రోజంతా శ్రమించే శ్రమజీవులకు ఉల్లాసాన్ని ఇచ్చేది వెండితెర. కారు చౌకగా అందాల్సిన ఈ వినోదం ఇప్పుడు ఖరీదుగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా రిలీజైన రోజు నుంచి టికెట్లన్నీ ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల మేరకే విక్రయించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మొదటి వారం పది రోజుల వరకూ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని ప్రేక్షకుల నెత్తి మీద ‘అధిక రేట్లు’ బాదుడు బాదేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో

ప్రారంభమైన ఈ అక్రమాలకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెక్ పెట్టేశారు. ఇటీవలే కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, పంచాయతీల పరిధి మేరకు టికెట్ల ధరలను నిర్ణయిస్తూ ఒక జీవో విడుదల చేశారు. దీంతో సినిమా వర్గాల గొంతులు పచ్చివెలక్కాయ పడుతుంటే, ప్రేక్షకులందరిలోనూ హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే…

సినిమా మాధ్యమం చాలా శక్తివంతమైనది. కుటుంబ విలువలు, మానవతా విలువలను పెంచడంలో దీనికి తిరుగులేదనే చెప్పాలి. ఒకప్పుడు మంచి విలువలు కలిగిన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో అర్ధ, శత దినోత్సవాలు జరుపుకునేవి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. విలువలకు తిలోదకాలు ఇచ్చే సే సినిమాలే హల్ ఛల్ చేస్తున్నాయి. కథా బలం లేకుండానే అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుకుంటూ థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చే వాటిలో అధికశాతం సినిమాలు సినిమా తారాబలంపై ఉన్న మోజులో మొదటి పది రోజులూ హౌస్ ఫుల్ తో నడుస్తున్నాయి. ఆ తర్వాత థియేటర్లలో జనాల సంఖ్యను వేళ్లపై లెక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సినీ వర్గాల్లో కొంతమంది ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు నడుం బిగించారు. సినిమా విడుదలైన మొదటి పది రోజులూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అధికంగా రేట్లు నిర్ణయించి అమ్ముకునే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. దానివలన సినిమా రంగం బతికి బట్టకడుతుందని నమ్మబలికారు. దీంతో గత ప్రభుత్వాలు టికెట్ల రేట్ల పెంపు వలన పన్నుల రూపంలో ప్రభుత్వానికి కూడా లాభసాటిగానే ఉంటుందని భావించి ‘సై’ అన్నారు. దీంతో సినిమా విడుదలైన మొదటి పది రోజులూ టికెట్లకు రెక్కలు వచ్చేశాయి. దీనివలన సినిమా రంగం వారికి లాభసాటిగానే ఉన్నప్పటికీ సామాన్య ప్రేక్షకుడికి మాత్రం కొత్త సినిమా తొందరగా చూడాలనే ఆనందం ఆవిరైపోయింది. అయితే అధిక రేట్లకు టికెట్లను కొనుగోలు చేసి సినిమా చూడాలి..లేదంటే సాధారణ రేట్లు వచ్చేంతవరకూ వేచి చూడాలి. అభిమాని హీరో నటించిన సినిమా మొదటి వారంలోనే చూసేయాలన్న యావ ఉన్న వారు మాత్రం పెంచిన రేట్లుకే టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఆర్థికంగా స్థితిపరులు, అడ్డదారుల్లో డబ్బులు సంపాదించిన వారికీ ఈ టికెట్ల రేట్లు పెంపు పెద్దగా ప్రభావం చూపించనప్పటికీ, మధ్య తరగతి కుటుంబాలు, ఏ రోజు కూలీ ఆ రోజే సంపాదించుకునే వారికి మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బందులు పాల్టేస్తున్నాయి. అర్థాకలితో అలమటించే పరిస్థితులు కల్పిస్తున్నాయి. నెలకు రూ.50 వేల రూపాయలు సంపాదించే జీతగాడు కూడా అధిక రేట్లు ఉన్నన్ని రోజులూ సినిమా చూడాలనే ఆత్రుతను వాయిదా వేసుకుంటున్నాడంటే, ఈ టికెట్ల రేట్ల పెంపు విధానం ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ పెంచిన రేట్ల పై వచ్చిన ఆదాయానికి తగ్గ పన్నులు ప్రభుత్వానికి సక్రమంగా చెల్లిస్తున్నారా అనేది కూడా సందేహమే. ఈ విషయంలో సంబంధిత అధికారులు, సినిమా వర్గాలు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇలాంటి తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సినిమా రేట్లకు సంబంధించి కొత్త జీవోను విడుదల చేశారు. అంతేగాకుండా సినిమా విడుదల సమయంలో పెంచే రేట్ల విషయంలో కూడా కొరడా ఝులిపించారు. రేట్లను పెంచకూడదనే నిబంధనను పెట్టారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కన్నా తక్కువకు అమ్మాలన్నా, లైసెన్సింగ్ అథారిటీ నుంచి అనుమతి పొందాలనే నిబంధన పెట్టారు. దీనిబట్టి అధిక రేట్లకు ఎలాంటి మూకుతాడు వేశారో స్పష్టమైపోయింది. ఈ జీవో ఖచ్చితంగా అమలైతే మాత్రం సాధారణ ప్రేక్షకులకు మంచి రోజులు వచ్చేసినట్లే.