Uncategorized

సినీ వర్గాలకు జగన్ ఝలక్

ఒకవైపు టికెట్ రేట్ల తగ్గింపు… మరోవైపు ఎపి ఎఫ్ డిసి ద్వారా టికెట్ల అమ్మకాలు

గగ్గోలు పెడుతున్న బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రేక్షక మహాశయులు

సినిమా వ్యాపారంలో జరిగే మోసాలు, నెలకొన్న లొసుగులను వైకాపా ప్రభుత్వం పూర్తిగా గ్రహించింది. వాటికి అడ్డుకట్టు వేసేందుకు సరైన నిర్ణయాలు తీసుకుంటూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. అందుబాటు ధరలో సామాన్యుడికి వినోదం కల్పించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మన్నలను అందుకుంటోంది. సినిమా విడుదలైన మొదటి వారం రోజుల్లోనే సినిమా తయారీకి అయే ఖర్చును అధిక ధరల రూపేణా లాగే సేందుకు ఆయా వ్యాపారుల కుయుక్తులకు అడ్డుకట్టు వేసేందుకు ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే సినిమా టికెట్ల ధరలను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చింది. సినిమా థియేటర్లలోని సీట్ల కిరికిరికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పుడు ఎపిఎఫ్ డిసి హయాంలోనే ఆన్ లైనలో టికెట్ల అమ్మకాలకు శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ చర్యలతో సినిమా అభిమానులు లోలోన ఆనంద, హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా వ్యాపారులు అత్యధిక టికెట్ రేట్లతో సామాన్యుడి నడ్డి విరిచే విధానానికి స్వస్తి పలికేందుకు వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందనే వ్యాఖ్యలు జనాలు నుంచి వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే…

రోజంతా శ్రమించే శ్రమజీవులకు వినోదం కల్పించేంది వెండితెర మాత్రమే అని చెప్పాలి. సినిమా థియేటర్ లో సినిమా చూస్తే ఆ థ్రిల్ వేరనేది ప్రేక్షకుల ఉవాచ. కోట్లు ఖర్చు పెట్టి సాంకేతిక విలువలతో కూడిన సినిమాలను థియేటర్లలోనే చూసేందుకు జనాలు మొగ్గు చూపుతారు. అందుకే సినిమాల కోసం థియేటర్ల వైపు పరుగులు తీస్తుంటారు. ఒకప్పుడు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే సినిమా టికెట్ల రేట్లు ఇప్పుడు కొండెక్కి కూర్చోవడంతో థియేటర్లు కొన్ని వర్గాలకే పరిమితం అయిపోయింది. ఒకవేళ పేద, సామాన్య ప్రజానీకం థియేటర్లలో సినిమా చూడాలంటే జేబులు ఖాలీ చేసుకోవాల్సి వస్తోందనే ఆవేదన శ్రమజీవుల్లో నెలకొని ఉంది. వీరికి ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు సినిమా నిర్మాణాలు, టికెట్ల ధరలు విషయంలో ప్రత్యేకమైన నిబంధనలను విధించింది. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే సినిమా టికెట్ల ధరలు రాన్రానూ కొండెక్కి కూర్చున్నాయి. సినిమా తయారీ ఖర్చులతో పాటు నటీనటుల పారితోషికాలు పెంచేయడం దీనికి కారణం కావచ్చు. సినిమా విడుదలైన మొదటి వారంలోనే తమ పెట్టుబడులు వచ్చేయాలనే ధ్యేయంతో ప్రారంభమైన ఈ టికెట్ల ధరల పెంపు చివరకు లాభాలను కూడా అంతకు అంత సంపాదించేయాలన్న లాభాపేక్షతో సినిమా టికెట్లను అమాంతం పెంచేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ సినిమా టికెట్ల వలన నష్టపోయేది సామాన్య ప్రజానీకంతో పాటు సినిమా హీరోల ఫ్యాన్స్ కూడా ఉంటున్నారు. తమ హీరోల సినిమాలను విడుదలైన రోజే చూసేయాలన్న ఆత్రుతతో టికెట్లను బ్లాకులో పెట్టి మరీ ఈ సినిమా టికెట్లను కొనుక్కుంటున్నారు. దీంతో సినిమా వర్గాలు కూడా టికెట్ల రేట్లను పెంచినా జనాలకు పెద్దగా ఇబ్బందులు ఉండటం లేదనే భ్రమతో ఉన్నారు.

టికెట్ల రేట్ల పెంపు అనేది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మూకుమ్మడిగా ఏకమై పెంచేస్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. సినిమా వినోదం విషయంలో జరుగుతున్న దోపిడీని దృష్టిలో ఉంచుకొని జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా పెరిగిన సినిమా టికెట్ల రేట్లకు కత్తిరి వేసింది. వాటిని తూచా ఆచరించాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తూ ఒక జీవోను కూడా విడుదల చేసింది. ఈ జీవోతో తలలు పట్టుకున్న సినిమా వర్గాలకు మరో తలనొప్పిని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సినిమా టికెట్లను ఆన్ లైన్ లోనే ఎపిఎఫ్ డిసి రూపొందించిన యాప్ ద్వారా అమ్మకాలు సాగించాలని పేర్కొంది. ఈ ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు అనేవి గతంలో కూడా సినీ వర్గాలు అమలు చేస్తున్నాయి. అయితే కొత్తగా ఇకపై ఎపి ఫిల్మ్ డవలప్ మెంట్ తయారు చేసిన యాప్ ద్వారానే అమ్మకాలు సాగించాలనీ, అందుకు కావల్సిన ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేయడమే గాక, అందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సినీ వర్గాలుపై మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. సాధారణ ప్రజలకు ఇందులో మర్మం తెలియకపోవచ్చు. గతంలో మాదిరిగా ఆన్‌లైన్ అమ్మకాలను సినిమా వర్గాలు ఎంచుకున్న మార్గంలోనే చేయడానికి, ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయడానికి చాలా మర్మాలు ఉన్నాయని సినిమాటోగ్రఫీ యాక్టుపై కాస్త పట్టు ఉన్న వ్యక్తులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా టికెట్లు అమ్మకాలపై వచ్చే జీఎస్టీ వలన ఆదాయం వస్తోంది. కొంతమంది వ్యక్తులు తక్కువ సీట్లను ప్రభుత్వానికి చూపిస్తూ, ఎక్కువ సీట్లను ఏర్పాటు చేసుకొని జీఎస్టీని ఎగవేస్తున్నారనీ, అందువలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీుకుందని వీరు చెబుతున్నారు. అది ఎంతవరకూ నిజమో ఆయా సినీ వర్గాలకే తెలియాలి. గతంలో సినిమా థియేటర్ లోని సీట్లు నిండిపోయినా, అదనపు కుర్చీలను వేసి, థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని వాటిలో కూర్చోబెట్టి సంతృప్తి పర్చేసేవారు. ఇలా చేయడం వలన ఈ అదనపు సీట్ల వలన ప్రభుత్వానికి పైసా రాబడి వచ్చేది కాదు. దీనిని గ్రహించిన ప్రభుత్వం అదనపు సీట్లును వేస్తే ధియేటర్ లైసెన్స్ రద్దు చేస్తామని ఖరాఖండిగా చెప్పడంతో ఆ తరహా అక్రమాలకు అడ్డుకట్ట పడినట్లయింది.

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు మరో మార్గాన్ని సినీ వర్గాలు ఎంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువ సీట్లను తక్కువుగా చూపిస్తున్నట్లు ఆరోపణలు రావడం సినిమా సీట్ల విషయంలో మరో ఖతర్నాక్ విషయం కూడా వినబడుతోంది. లోయర్ క్లాసు టికెట్లకు ఎసరు పెడుతూ వాటిని హైక్లాసులో కలిపేసి అధిక లాభాలును ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే సినిమా విడుదలైన మొదటి కొన్ని రోజులూ అత్యధిక రేట్లకు అమ్ముకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకునేవారు. అలా వచ్చిన ఆదాయానికి జీఎస్టీ చెల్లించడంలో కూడా తేడాలున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తున్నట్లు తెలిసింది. ఈ కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వం ఎపిఎఫ్ డిసి యాప్ ద్వారా అమ్మకాలు సాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆయా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయనే చెప్పాలి. సిఎం జగన్ ని తక్కువుగా అంచనా వేసిన సినిమావర్గాలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మా చరిష్మా ముందు జగన్ ఎంత.. అని నిర్లక్ష్యం చేసిన ఈ వర్గాలు ఇప్పుడు జగన్ ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తాడాని ఎదురుచూస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. జనాల కోసం పరితపించే సిఎం జగన్, వారి కోసం ఎలాంటి నష్టాన్ని అయినా భరించేందుకు వెనుకాడడని చెప్పాలి. సినిమా టికెట్ల రేట్లు ఎంత ఎక్కువుగా ఉంటే ఎంత అధికంగా జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం అంత అధికంగా వస్తుంది. కరోనా వైరస్ కారణంగా రెవెన్యూ లేక అల్లాడిపోతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమైనదిగా చెప్పాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సినిమా టికెట్ల అమ్మకాల విధానం తమిళనాడులో అమలవుతుండగా, తెలంగాణ కూడా ఇందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి వెనుకంజ వేసినప్పటికీ, ఆంధ్రాలో మాత్రం జగన్.. జై అనిపించేశాడు. ఇదిలా ఉండగా కోలీవుడ్ (తమిళ సిని రంగం)లోని కొందరు హీరోలు జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరంతా తమిళనాడు గవర్నమెంట్ ని ఈ తరహా టికెట్ల అమ్మకాలను ప్రవేశపెట్టాలని అక్కడి సిఎం స్టాలిన్ కు లేఖలు రాయబోతున్నట్లు తెలిసింది.