ZILLAPARISHATH

ముఖ్యమంత్రి పాలనకు బ్రహ్మరథం

పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
*జిల్లా పరిషత్ సభ్యత్వమే రాజకీయాలకు పునాది
*సంక్షేమ పథకాల అమలుకు ప్రాదేశిక సభ్యులే కీలకం

భారత్ వాయిస్, విశాఖపట్నం, సెప్టెంబరు 25: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనకు విశాఖపట్నం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా జల్లిపల్లి సుభద్ర తో పాటుగా ఉపాధ్యక్షులు, టి.అప్పారావు, బి.వి.సత్యవతి, కోఆప్షన్ సభ్యులుగా పి.ఎస్.ఎస్.జోసెఫ్, వి.వి.సత్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో తమ పార్టీకి 37 జెడ్పీటీసీలను అందించిన జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసు కుంటున్నానన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజల మేలుకోరి వివిధ సంక్షేమం, అభివృద్ది పథకాలను అమలు చేస్తున్నారన్నారు. విశాఖ జిల్లాలో మూడు విభిన్న ప్రాంతాలు సిటి ఆఫ్ డెస్టినీ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయన్నారు. మొదటి సారిగా పి.టి.జి. తెగకు చెందిన గిరిజన మహిళకు జెడ్.పి.పి. అధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి జిల్లాప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లలో భాగంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. నూతనంగా ఎన్నికైన జెడ్.పి.టి.సిలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి జిల్లా అభివృద్దికి కృషి చేయాలని, అన్ని రంగాలలో జిల్లాను అగ్రపథంలో నడిపించాలన్నారు.
ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజా రంజకపాలనకు నిదర్శనంగా రాష్ట్రంలొ ముత్తం 13 జిల్లా పరిషత్ లు తమపార్టీ ఖాతాలోనే చేరాయన్నారు. మెజార్టీని బాధ్యతగా భావించి మరింత కృషి చేయాలన్నారు. గెలిచిన చైర్ పర్సన్, సభ్యులు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలందరికీ చేరేలా పని చేయాలన్నారు. జెడ్ పి చైర్ పర్సన్ గా ఎన్నికైన సుభద్ర మాట్లాడుతూ తనకు అత్యున్నత పదవినిచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని పేదలందరికీ పథకాలు అందేందుకు కృషి చేస్తానని చెప్పారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యురాలు జి.మాధవి, శాసన సభ్యులు యు.వి.సూర్యనారాయణరాజు, జి.అమర్ నాధ్, కరణం ధర్మశ్రీ, కె.భాగ్యలక్ష్మి, శెట్టి ఫల్గుణ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అదీప్ రాజ్, గొల్లబాబూరావు తదితరులు పాల్గొన్నారు.